Saturday, August 29, 2009

కొంచెం లూజా?

దొడ్డుబియ్యం

భోజనానికి ఇంటికి వచ్చే సరికి మధ్యాన్నం రెండున్నర అయి పోయింది.  


‘వడ్డించేశాను! రండి!’ అన్న నా భార్యామణికి ఓ శుష్కహాసం చదివించి, చొక్కా వొక్కటే విప్పి, ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కొని, డైనింగ్ టేబులుదగ్గరకి చేరేసరికి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి, అన్నీ సిద్ధంగా వుంచింది మా శ్రీమతి.  


నిజం చెప్పొద్దూ—భోజనానికీ భోజనానికీ మధ్య మంచినీళ్ళు తప్ప, టీ కాఫీలూ వగైరా తాగడం, చిరుతిళ్ళు తినడం అసలు అలవాటు లేకపోబట్టి, ఆకలి నకనకలాడుతోంది! 


పొద్దున్న యేడు గంటలకి మా జోనల్ ఆఫీసునించి వచ్చిన ‘రికవరీ టీం’ తో జీపులో బయల్దేరాను—పొద్దెక్కితే జనాలు తమ తమ పనుల్లోకి వెళ్ళిపోతారాయే! ఇంటిదగ్గర వుండరు! మరి వాళ్ళ అడ్రెస్ లు మాత్రమే కలిగున్న మేము, వాళ్ళు ఇంటిదగ్గర లేకపోతే—ఇంకేమి రికవరీ?  


‘కెవ్వు’ అనరవబోయాను—అర్థాంగి కంచం లో వడ్డించిన పదార్థాలని చూసి.  


‘ఇవేమిటే?’ అన్నాను—గరిటెలోంచి కంచంలోకి జారిన పసుపురంగు ‘అర్థగోళీలని’ గమనించి.  


‘రాజన్న కందిపప్పు వద్దూ—మిగతా పప్పులు వండుకోండీ అన్నాడని, పిల్లలు కాలక్షేపానికి వేయించుకు తిండానికి తెచ్చుకున్న పసుపు బథాణీలని ముద్దపప్పు వండానండీ’ అంది.  


“మరి పప్పు’లు’ కనిపిస్తున్నాయేగాని, ముద్దేదే?” అంటే, ‘మీది మరీ చోద్యం!’ అంటూ అన్నం వడ్డించింది.  


మరొసారి ‘కెవ్వు’…..—ఇదేమిటీ! ‘గంజిగంజి గావున్న ఈ పెద్ద పెద్ద పదార్థాలేమిటీ?’ అనడిగాను.  


‘రాజన్నా—దొడ్డు బియ్యం వండుకోండీ—సన్న బియ్యమే అక్కర్లేదూ అన్నాడు గదాని, అవే తెచ్చాను మన షావుకారు కొట్లోంచి.’ అని వడ్డించింది.  


కలుపుకోడానికి ప్రయత్నం చేస్తూ—‘అయితే 15-50 కే దొడ్డు బియ్యం ఇచ్చారన్నమాట?’ క్రొశ్నించాను.  


“మీరు భలే క్యామెడీగా మాట్లాడతారండీ—రాజన్నకైతే వదిన చెప్పగానే, సూరీడు తెలంగాణా శకుంతల లెవెల్లో—‘ఒరే పిచ్చిరెడ్డీ! పెంట్రెడ్డీ! యెరుకల్రెడ్డీ! యానాదిరెడ్డీ! బండ్లు తియ్యండ్రా!’ అంటూ ఓ పాతిక సుమోల్లో బయలుదేరితే, బస్తాలకి బస్తాలు దొడ్డు బియ్యం వాళ్ళకి (కేజీ 15-50 చొప్పున బిల్లులతోసహా) చదివించి, ‘దయవుంచన్నా’ అని యెదురు కేజీకి పదో పరకో ముట్టచెపుతారుగానీ, మనకి యెవరిస్తారండీ? షావుకారు కేజీ 20 రూపాయలకమ్ముతున్నాము—మీక్కాబట్టి 19-50 కి ఇస్తాను అని ఇచ్చాడండి!” అంది.  


అప్పటికి ఆ అన్నాన్నీ పప్పునీ కలపలేక పక్కకి తోసేసి, ‘పచ్చడేమైనా వెయ్యి’ అంటే, ఓ చిన్న గిన్నెలోంచి అదేదో ఆకుపచ్చని జిగురు పదార్థాన్ని చెంచాతో వడ్డించింది!  


‘ఇదేం పచ్చడి?’ అనడిగితే—“మరిచాను—చింతపండుకూడా ప్రియం అయిపోయింది—నిన్న ఈనాడులో యెవరో చింతపండుకి బదులుగా ‘చైనా నిమ్మకాయల్ని’ యెండబెట్టి గుజ్జుతీసి వాడుతున్నాను’ అని చెప్పింది. మనకి చైనా నిమ్మకాయలు లేవుకదా అని, బ్రిలియంట్ గా ఆలోచించి, మన దొడ్లోని నిమ్మా, నారింజా, కమలా, పంపరపనసా ఆకుల్ని—అవి యెంత పుల్లగా వున్నాయో—చింతపండుకి బదులుగా మిక్సీలోవేసి, మనదొడ్లోనే వున్న కరేపాకునీ, రెండు పచ్చి మిరపకాయల్నీ, వుప్పునీ వేసి పచ్చడి చేశాను! అందులో రాజన్న చెప్పినట్లు కాసిని పచ్చి బటానీలనికూడా వేశానండోయ్! మీరే అంటారుగా—‘వుప్పూ, కారం, చింతపండూ సమపాళ్ళలో తగిలితే, గడ్డితోకూడా రుచికరమైన పచ్చడి చెయ్యొచ్చు!’ అని”  


పాతాళభైరవిలో తోటరాముడు ప్రవేశించిన, కత్తులు తిరుగుతున్న మార్గం లో లాంటి కత్తులు నా మెదడులో తిరుగుతున్నట్టు అనిపిస్తూండగా—‘బాగుంది గానీ, మరి చారూ, పులుసూ లాంటివి యేమన్నా…….?’ అని నసుగుతూంటే….  


భార్యామణి, మరో గిన్నెలోంచి మరో చిప్ప గరిటెతో—ఓ బూడిదరంగు ద్రవ/ఘన పదార్ధాన్ని వడ్డించబోతూంటే, ‘ఇదేమేటే?’ అనడిగాను.  


‘వులవ పప్పులుసండీ’ అంది!  


‘వులవ చారు విన్నాం—వులవల్ని వుడికించిన నీళ్ళతో పెడతారు—వులవల్ని పశువులకి తినిపిస్తారు—ఈ వులవ పప్పులుసు యెక్కడిదీ?’ అన్నాను దీనం గా.  


“భలేవారే! రాజన్నేం చెప్పాడు? కంది, పెసర, మినప, శెనగ పప్పుల్తప్ప, ఇంకే పప్పులైనా వుపయోగించుకోండి—ధరలెందుకు తగ్గవో నేను చూస్తాను—అన్లా? అందుకే………..ఇంకా ఈనాడులో కూడా వులవలూ, బొబ్బర్లూ, అలచందలూ, గోరుచిక్కుడూ--ఇలాంటి వాటితో చేసుకోగల విచిత్ర వంటకాలన్నీ ప్రచురిస్తున్నారు కదా!”  


‘నీ రాజన్నో!’ అని మనసులో అనుకుంటూ, 'చెల్లెలు సబితని హోం మంత్రిని చేసినట్టు, నిన్నుకూడా యే వంటల మంత్రో చేసేస్తాడేమో! పోనీ వూరగాయలేమన్నా…………’ నసిగాను.  


‘అయ్యయ్యయ్యో! చిన్న జాడీలలోకి తీసినవన్నీ నిన్ననే అయిపోయాయి—ఇవాళ పొద్దున్న తీద్దాములే అనుకున్నాను—తీరా చేసి, ఇవాళ కాస్త ముక్కు బురుబుర్లాడుతూంటే, తల స్నానం చెయ్యలేదు—తలస్నానం చెయ్యకుండా వూరగాయ జాడీలు ముట్టుకోడమెందుకనీ……..!’ అంటొంది.  


‘పోనీలే—కాస్త మజ్జిగపోసెయ్యి’ అని, ఆ జిగట జిగట మజ్జిగ్గంజి అన్నాన్ని రెండు ముద్దలు నోట్లో వేసుకొని మింగినట్టు నటించి, చెయ్యి కడిగేసుకొంటూంటే, నా ధర్మపత్ని, ‘పాపిష్టిదాన్ని! అర్థాకలితోనే లేచిపోతున్నారు!’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొంటూంటే  


‘పిచ్చిదానా! మొగుడు అర్థాకలితో లేస్తే పాపం గానీ, పూర్ణాకలితో లేస్తే పాపమేమీ కాదు! వూరుకో!’ అన్నాను.  


‘ఈ సారి ఆ పాపిష్టివాడికి వోటేస్తే వొట్టు’ అంటూంటే  


‘ఇదేదో తెనాలిరామలింగడి పిల్లి వ్యవహారం లాంటిదని నేననుకుంటాను గానీ, మన పెళ్ళయిన గత 35 యేళ్ళలో ఇవన్నీ మనకి మామూలే కదా? పైగా రాష్ట్రం లో అందరు ఆడాళ్ళూ చేస్తున్నదే నువ్వూ చేశావు—అంతే!’ అన్నాను.  


(మనసులో ‘మీ రాజన్న సలహాలకి పాడెకట్ట!’ అనుకున్నాననుకోండి!)  


అదీ సంగతి!



Saturday, August 22, 2009

కరవు చర్చ

కరవా మజాకా
‘బావా! నీ కొలువుకూటము రాను రాను రణరంగ మగుచున్నదేమయ్యా?’ అంటూ ప్రవేశించాడు—మా ‘తక్కెళ్ళ రెడ్డి’--నిన్నటి అసెంబ్లీలో కన్నా వేడి వేడి గా జరుగుతున్న మన ‘రాష్ట్రం లో కరువు’ గురించి మా 'సోల్ ' లో జరుగుతున్న చర్చలోకి!
అన్నట్టు మా కుమ్మరదాసుడికి బదిలీ అయిపోయి, ఈ ‘టీ’ ఇంటిపేరుగల ‘అదేదో’ రెడ్డి బ్రాంచి మేనేజరుగా వచ్చాడు. ఆయనకి మేము పెట్టుకున్న ముద్దు పేరు ‘తక్కెళ్ళ రెడ్డి!’ ఆయనకి సందర్భానుసారం ‘కురుక్షేత్రం’ నాటకం లోని పద్యాలు వాడుకోవడం ఓ సరదా.
వాళ్ళ వూరు తక్కెళ్ళపాడు కాకపోయినా, ‘చాలా బ్యాలెన్సుడు గా వుంటాడు’ అని ఇష్టపడేవాళ్ళూ, ‘తక్కెడలా కాసేపొకవైపూ, ఇంకాసేపు ఇంకొకవైపూ వుంటాడు’ అని ఇష్టపడనివాళ్ళూ అంటారు.
‘అదికాదు బావా! నీదేమైనా నాలుకా—తాటి పట్టా? ఓ పక్క మీనం తరవాత మేషమా, మేషం తరవాత మీనమా, అదెన్నోది, ఇదెన్నోది అని లెక్ఖెట్టుకుంటావా! మరో పక్క వెకిలి నవ్వు నవ్వుతూ మీరు ప్రజలని భయపెట్టకండి—మేము కమిటీలు వేశాము, సరియైన సమయం లో కరువుని ప్రకటిస్తాము—అసలు ప్రకటించినా, ప్రకటించకపోయినా తేడా యేమీ లేదు—అంటావా?’—అనరిచాడు—మా సుందరయ్య.
‘నేనా?’ అని దీనం గా మా తక్కెళ్ళ రెడ్డి అడుగుతూంటే, అందరూ ఫక్కున నవ్వి, వాతావరణం కాస్త చల్లబడింది!
“మొదట ‘ఆగష్ట్ మొదటివారం లో అందరూ విత్తనాలు చల్లుకుంటారు—అది పూర్తయితేగానీ, బ్యాంకులు ఋణాలు ఇవ్వవు—అందుకని ఆగాం!’ అన్నాడు—యే బ్యాంకైనా రైతులు విత్తనాలు చల్లారా లేదా పరిశీలించి మాత్రమే పంట ఋణాలు ఇస్తోందా? అసలు సారవా కి జూన్ నెలలోనే ఋణాలు ఇవ్వడం మొదలెట్టేస్తారు కదా?” అన్నాడు మా బాలగంగాధర తిలక్.
“చూడండి! ‘మనం ఇప్పుడే ప్రకటిస్తే, బ్యాంకులు ఇంక ఋణాలు ఇవ్వవు—అందుకే—అందరూ ఋణాలు తీసుకునేవరకూ ఆగాలి’ అన్నాడు తరవాత! అంటే, అందరూ ఋణాలు తీసుకున్న తరవాత యే మాఫీయో ప్రకటిద్దాం, అప్పుడు పోయేవి బ్యాంకులూ, పడే వోట్లు మనకీ అనేనా?” అన్నాడు మా కేషియర్ వెంకట నాగభూషణం.
“తరవాత ‘రేపు జరగబోయే బ్యాంకర్ల సమావేశం లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు—అందుకని అదయ్యేవరకూ ఆగాల్సిందే’ అన్నాడు—బ్యాంకర్ల మీటింగుకీ, కరువుకీ యేమిటి సంబంధం అసలు?” క్రొశ్నించాడు మా బాలగంగాధర తిలక్.
“మూడో వారం వచ్చేటప్పటికి, ‘అసలు ప్రకటించనే ప్రకటించం—యెడం చెయ్యి పెట్టినా, పుర్రచెయ్యి పెట్టినా తేడా యేముంది? ప్రతిపక్ష రాజకీయం కాకపోతే? మీకేమి కావాలో చెప్పండి—విత్తనాలా? ఇస్తాము, నీళ్ళా? ఇస్తాము, యెరువులా? ఇస్తాము, గడ్డా? యేర్పాటు చేస్తాము, గొర్రెలా? ఇప్పిస్తాము, బర్రెలా? ఇప్పిస్తాము, ఇంకేమి కావాలి కరవుని యెదుర్కోడానికి? మరెందుకు ప్రకటన?’ అంటున్నాడు! మరి ఇప్పటికే ప్రకటించిన రాష్ట్రాలూ, సహాయం ప్రకటించిన కేంద్రం, పర్యటిస్తున్న కేంద్ర అంచనా బృందాలూ, ఇవన్నీ మిథ్యా? వాళ్ళందరూ వెర్రివాళ్ళా? యెవరి చెవుల్లో పువ్వులు పెడతాడు?” అంటూ మళ్ళీ రగిలిపోయాడు మా కామ్రేడ్ సుందరయ్య.
“అవన్నీ కాదు—తీరా ప్రకటించాక, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అనుభవాలు యెదురై, కేంద్రం మొండిచెయ్యి చూపిస్తే, వాళ్ళతో దెబ్బలాడే మొగాడు యెవడూ లేడుకదా—అందుకని భయం!” అన్నాడు మా వెంకట నాగభూషణం.
“పిచ్చివాళ్ళలారా! అసలు రహస్యం నేచెప్పనా? మన తెలుగువాడెవరైనా, పదిమందితోపాటు ‘జై’ అంటున్నా, ‘తొయ్’ అంటున్నా, ప్రతివాడికీ తనకే ప్రత్యేకమైన ఒక ‘స్వంత అజెండా’ వుంటుంది! అదే వాడికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం! అర్థమయ్యిందా?” అన్నారు చిద్విలాసం గా మా సర్వంబొచ్చు స్వామి!
ఇంకెవరైనా మాట్టాడితే వొట్టు!
నా అలవాటు ప్రకారం నా సిగరెట్టు నేను కాల్చుకుంటూ చిరునవ్వుతో వుండిపోయాను--చర్చ రగలేసిన నేను!