Saturday, April 16, 2011

గోడమీది......



.......వ్రాతలు

నాకు తెలుసు.....గోడమీది అనగానే, పిల్లులూ, బల్లులూ వగైరా అనే అనుకుంటారని. 

కానీ నేను వ్రాసేది "వ్రాతల" గురించి. అంటే........

1960 ల లోనో, ఇంకా ముందేనో, ఈ 'గోడమీది వ్రాతలు' వ్రాయబడేవి. సినిమాలలో చూపించినట్టు కాదు--ప్రకటనల రూపం లో. నీటిమీది వ్రాతలకి ఇంగ్లీషులో యేదైనా పేరు వుందో లేదో తెలీదుగానీ, ఈ గోడమీది వ్రాతలకి ఓ పేరుంది "గ్రాఫిట్టీ" అని. దీంట్లో "గిన్నిస్ బుక్" లోకి యెక్కినవి కూడా వున్నాయి(ట).

సిమెంటు ఇటికలతోనో, మామూలు ఇటికలతోనో మనం ప్రహరీ కట్టించుకుంటాం మన ఇంటి చుట్టూ. దాని తడి ఇంకా ఆరదు. కొంతమేర తెల్లగా సున్నం వేయబడి వుంటుంది తెల్లారేసరికల్లా! మనం గమనించం. ఆ మర్నాటికి, ఆ చోటులో ఓ ప్రకటన ప్రత్యక్షం! అదీ రోడ్డున పోయేవాళ్లు మనకి చెపితేనే తెలిసేది. 

అప్పట్లో--"అదేదో; లీకో; కాల్ గ్యాస్" అనే ప్రకటన ముఖ్యమైనది. మొదటిది నాకు ఙ్ఞాపకం లేదు. యెవరైనా గుర్తు చేస్తే సంతోషం. రెండోది, 'క్రమ షడ్భుజాకారంగా' వుండే లీకో బొగ్గులు. అవి ప్రత్యేకంగా 'నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్' వారు తయారు చేసేవారు. మూడోది నేటి మన వంట గ్యాస్. ఇంటింటికీ కావిళ్లలో మోసుకొచ్చి, సిలిండర్లూ, స్టవ్ లూ ప్రదర్శించి, కేవలం రెండువందల రూపాయలో యెంతో, కొనుక్కోమని బ్రతిమలాడేవారు. "ఊహూ...." అనేవారు చాలా మంది. (తరవాత కథ అందరికీ తెలిసినదే!)

ఇంక, "సీతా మలమా"; "సపట్ లోషన్; మలమా"; "దాద్, ఖుజ్లీ కీ దవా--జాలిం లోషన్" లాంటి ప్రకటనలు తరవాత వచ్చేయి. 

ఇంకా ముఖ్యంగా, యెన్నికలు వచ్చినప్పుడు, "ఫలానా పార్లమెంటు అభ్యర్థి.....కీ; ఫలనా అసెంబ్లీ అభ్యర్థి......కీ 'మాత్రమే' మీ వోటు వేయండి. యెన్నికల గుర్తు ఫలనా, యెన్నికల తేదీ ఫలానా!" అని ప్రకటనలు తెల్లారేసరికల్లా అనేక గోడలమీద, అంతకు ముందటి ప్రకటనలని తుడిచేసి ప్రత్యక్షమైపోయేవి.

టీ ఎన్ (అల్) శేషన్ పుణ్యమా అని అవి రద్దు అయిపోయాయి. (వాడు లేడు కాబట్టి, మేము ఇప్పుడు తెగిస్తాం అనేవాళ్లెవరూ రాకపోవడం మన అదృష్టం.)

ఇందులో క్యామెడీ యేమి వుంది అని మీరడగొచ్చు. 

మా తెలుగు మేష్టారు ఒకాయన చెప్పారు--విజయనగరంలో ఓ అర్టిస్ట్ వుండేవాడట. గోడలమీది ప్రకటనల్లో స్పెషలిస్ట్. "ఫలానా....ఫలానా" అని ప్రకటన వ్రాసేసి, ఓ మూల చిన్న అక్షరాల్లో తన పేరు/సంతకం చేసేవాడట "నందెం గవయ్య" అని. 

మేము మా మాస్టారిని యెక్కువగా అల్లరిచేసి విసిగించేసినప్పుడు ఆయన "నా మొహం మీద నాపేరు నం|| గ|| అనిరాసుందేమిట్రా?" అని ఖోప్పడేవారు. 

ఇంక యెలెక్షన్ గ్రాఫిట్టీలకొస్తే, మా కొండెలు "జమ్షీద్", "యజ్దానీ" అని వుండేవారు. (ఆవి వాళ్ల అసలు పేర్లు కాదు) జమ్షీద్ మంచి ఆర్టిస్ట్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అక్షరాలనీ, అప్పట్లో వచ్చే సినిమా టైటిల్సునీ "యెలా వున్నవి అలా" వ్రాసేసేవాడు. సహజంగా, యెన్నికల్లో అభ్యర్థులు వాణ్ణి పిలిచి, నీకు ఇన్ని గోడ బోర్డులకి ఇంత ఇస్తాం అని కాంట్రాక్టు కుదుర్చుకొనేవారు.

మరి యజ్దానీ తక్కువ తిన్నాడా? తనకి యే భాష అయినా 'వంకర టింకరగా' వ్రాయడమే వచ్చు. పైగా, రంగులు యెలా కలుపుకోవాలో, వాటికి ముడి పదార్థాలు యేమిటో, బ్రష్షులు యేవి వాడాలో--ఇలాంటివి వాడికి తెలీదు. కానీ, ప్రయోగాలు చేసేసేవాడు. జమ్షీద్ గాడు కుదుర్చుకున్న అభ్యర్థికి ప్రత్యర్థిని యెంచుకొని, వాడికన్నా 'తక్కువ రేటు' కి తాను వ్రాస్తాను అని కాంట్రాక్టు కుదుర్చుకొని, ఇంక మొదలెట్టేవాడు--పెట్రోమాక్స్ లైట్లు వెలిగించుకొని, (జమ్షీద్ పగలే వ్రాసేసేవాడు--తనకి భయం లేదు కదా!) తెల్లవార్లు ఓ పది పదిహేను బోర్డులు చాలా ఖష్టపడి వ్రాసేసి, తెల్లవారాక ఇంటికివెళ్లి పడుకొనేవాడు.

ప్రొద్దున్నకల్లా, ఆ బోర్డులు--పెయింట్లు రంగులు కారుకొంటూ, గడ్డకట్టి, భయంకరంగా అయిపోయి--దర్శనం ఇచ్చేవి జనాలకి! 

అంతకు ముందే హిందీలో "గుమ్ నామ్" (అంటే అర్థం రహస్యంగా అనేమో) సినిమా వచ్చింది. దాని టైటిల్ అలా 'రక్తం కారి గడ్డకట్టినట్లు' చిత్రీకరించారు. 

అప్పటినించీ యజ్దానీని "గుమ్ నామ్ ఆర్టిస్ట్" అని యేడిపించేవాళ్లం. 

పాపం జమ్షీద్ 50 యేళ్లకే వెళ్లిపోయాడు. యజ్దానీ మాత్రం ఇంకా ఓ జర్నలిస్టుగా వున్నాడట. కలుస్తాడేమో చూద్దాం!