Saturday, November 27, 2010

'....పరిఙ్ఞానం'

రాజకీయ శంకలు

"గురువుగారూ! నాకు లఘుశంక వచ్చింది!"

"హారి నీ! అయితే నాదగ్గరెకెందుకొచ్చావు?"

"లఘుశంక అయినా, గురుశంక అయినా మీదగ్గరకే కదండీ రావాలి?"

"నీ భాషా పరిఙ్ఞానం మండా! చిన్న సందేహం, పెద్ద సందేహం అనా నీ వుద్దేశ్యం! సరే, యేమిటది?"

"దానికన్న ముందు ఇంకోటి......."

"అదేదో చెప్పేడూ!"

"తమరు భక్తులచేత చేయించడమేగానీ, ఆచమానం చేస్తున్నట్టు యెప్పుడూ నేను చూడలేదు....అసలు చేస్తారా? అని"

"హారినీ! రోజూ 'దేవతార్చన ' చేసేటప్పుడు మనసులోనే చేస్తానులే! అదే కాకుండా, నా కమండలం లోంచీ, తాబేటికాయలోంచీ ఆరారగా తీర్థం పుచ్చుకొంటూ, ఫలాలూ అవీ ఆరగిస్తూ, రెండుమూడు గంటలకోసారి 'అల్పాచమనం', రోజూ ఒకటి రెండు సార్లు 'అధికాచమానం' చేస్తూనే వుంటాను లే! ఇంతకీ నీ శంక యేమిటీ?"

"మా వాళ్లని పదవులనించి తప్పించాం! కమలం వాళ్లు యెడ్డప్పని తప్పించడం లేదు అని ఇటాలియమ్మ యాగీ చేస్తోంది కదా, మరి కమలం వాళ్లు దీటుగా జవాబివ్వట్లేదు యెందుకంటారు?"

"బాగుంది నీ శంక! ఆవిడ దృష్టిలో పదవినించి తప్పించడం ఓ ఘోర శిక్ష! ఆ పదవి కల్మాడీ లాంటివాడి 'ఫలానా రోజున ఫలానా టైముకి మీటింగు వుంది ' అని వుత్తరాలు వ్రాసే అత్యున్నత పదవి అయినా సరే! అంతేగానీ, వాళ్ల మీద ఈగకూడా వాలకూడదు. ఈ పదవీదారులు యేమి చేసినా, వెనకాల వుండేది అధికార గణం. వాళ్ల మీద కూడా ఈగ వాలకూడదు. అదేపని చెయ్యమని కమలం వాళ్లకి వుద్బోధిస్తోంది!"

"బాగా చెప్పారు! ఇంకో గురు శంక వుంది గానీ, ఇంకోసారి!"

"నీ భాషా పరిఙ్ఞానం మరోసారి మంటెట్టా! అసలు ఈ 'శంకలకీ' 'ఆచమానాలకీ' అర్థాలు తెలుసుకొని మరీ యేడు ఈ సారి!"

శుభంభూయాత్.

Friday, November 26, 2010

ఇల్లరికపు.....

.....అల్లుడిరికం

"గురువుగారూ! ఒక పెద్దమనిషిని--మేథావీ, ఆర్థిక వేత్తా, వున్నత పదవిలో వున్న మచ్చలేని వ్యక్తీ అయిన ఆయన్ని, బొత్తిగా "నిష్ క్రియాపరుడు" అంటూ నిందించడం యేమి బాగుంది?"

"ఆవును శిష్యా! ఆయన నిజం గా 'నిష్కామ కర్మ యోగి!' అలా అనడం తప్పే!"

"అదేంటండోయ్! అంత గొప్ప బిరుదిచ్చేశారు!"

"అవును నాయనా! ఆయన వొప్పుకున్నదే ఇల్లరికపు అల్లుడిరికానికి. దానికి తగ్గ 'క్రియలే' చేస్తున్నాడు--నిష్కామంగా!"

"నాకర్థం కాలే!"

"చెపుతా విను.

వెనకిటికో అత్తగారు వుండేది--'మా అల్లుడు బహుమానస్తుడు--ఆతనికి యేపనియు చెప్పము--ఐనంగానీ, తగు మూడు పనులు చేయను--ఇల్లలుకను, పేడ చేయ, యెంగిళ్లెత్తన్!" అని గర్వం గా చెప్పేదట ఇరుగుపొరుగులతో.

అలాగే, ఇలాంటిపనులకి వొడబడే ప్రథానిత్వం స్వీకరించాడు అత్తగారిలాంటి ఆవిడ అధికారానికి యేమాత్రం లోటు రానివ్వకుండా. 

ఆయన నిష్కామంగా చేస్తున్న పనులు 1. తన పదవిని కాపాడుకోవడం--లేకపోతే, తన స్థానం లో ఇంకో చేటపెయ్యని వెతుక్కోవడం ఆవిడకెంత కష్టం!

2. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం--లేకపోతే చీమదూరే సందిస్తే యేకంగా యేనుగులని దోపెయ్యడానికీ, కోట్లు గుమ్మరించి కోటలో పాగా వెయ్యడానికి కార్పొరేట్ రాజకీయులు సిద్ధం గా వున్నారు.

3. తన పార్టీని కాపాడుకోవడం--ఆవిడ అధికారానికి తిరుగులేకుండా, పార్టీని చక్కని కేకుగా భద్రపరచి, వీలైతే దానిమీద చెర్రీలూ వగైరా అలంకరించి, రేపు ఆవిడ కొడుకుకి అప్పగించాలి మరి!

ఇంకా, తానే ప్రభుత్వం అని మరచిపోయి, 'అవినీతిరహిత పరిపాలనని అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది' అని కూడా సెలవిచ్చారు.

ఇలా మూడు పనులని ప్రతిఫలం ఆశించకుండా నిర్వహిస్తున్న ఆయన కర్మ యోగి కాడూ మరి?"

"నిజమేనండీ గురూగారూ!"

Tuesday, November 2, 2010

ఈనాడు "తెగులు"

మన తెలుగు

"రేప్పండక్కి యేం చేస్తున్నావొదినా?"

"కొంచెం వెరైటీగా వుంటుందని 'నువ్వుపప్పు' పాయసం చేద్దామనుకొంటున్నానొదినా!"

"యేమిటీ? 'నువ్వు పప్పా'?"

"అవునొదినా".

"అయితే, 'నువ్వు' పప్పా?"

"భలేదానివే. నేను కాదొదినా! 'నువ్వు' పప్పు!"

"బాగుంది. ఇవాళ ఈనాడు వసుంధర లో "నువ్వుల పాయసం" అంటూ వ్రాశారు! ఓ సారి చూడు."

"చూశానొదినా. వాళ్లు పెట్టిన ఫోటో లో మాత్రం చక్కగా తెల్లగానే వుంది. కానీ, నువ్వులతో యెవరైనా పాయసం చేస్తే, అలా వుంటుందంటావా? మరి రుచెలా వుంటుందో?"

"భలేదానివొదినా! ఇంకా నువ్వులతో చేసేశావు కాదు! నువ్వులంటే యేమిటనుకుంటున్నావు? వాళ్ల తెలుగులో 'నువ్వు పప్పు'!"

"వీళ్ల తెలుగు మంటెట్టా! మా యింటి దగ్గర్లో, నా చిన్నప్పుడు తెలుకులవాళ్లు జల్లెడలా చిల్లులుపొడిచిన డ్రమ్ముల్లో నువ్వులనివేసి, నానపెట్టి, చాలా కష్టపడి పొట్టు వొలిచి, పప్పు చేసి, యెండబెట్టడం చూసేదాన్ని! అలాంటిది యెంత తేలిగ్గా నువ్వులు అని వాడేస్తున్నారు వీళ్లు!"

"అంతే కాదొదినా. మీ అన్నగారు ఈ మధ్య తన వుద్యోగానికి నువ్వులూ, నీళ్లూ వొదిలేశారుగా? అప్పుడే తెలిసింది--నువ్వులు అంటే నాకు విశదం గా!"

"ఆవునొదినా! పెద్దవాళ్ల ఆబ్దికాలకి కూడా, తర్పణాలకీ వాటికీ నువ్వులే వాడతారు. అందుకే నాకూ డౌటొచ్చింది!"

"సరే! వాళ్ల తెలుగు మంటెట్టా అన్నావుగా. అలాగేకానీ! పాయసం మాత్రం నాకు కొంచెం పంపించుమీ.....మీ అన్నగారికి!"

"అలాగే వొదినా".