......ఫులికథ!ఒక వూరిలో రచ్చబండదగ్గర మరో వూరినించొచ్చిన ఓ తిప్పరాజుగారు చుట్టూ వున్న జనానికి వినోదం కలిగిస్తూ మంచి కథా కాలక్షేపం చేస్తున్నారు—‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ లాంటి కబుర్లతో, జనాలు ‘ఆహా! ఓహో’ అంటుండగా!
‘ఇక్కడ మా వూరివాళ్ళు యెవరైనా వున్నారా?’ అని అడిగాడు హటాత్తుగా.
‘యెవరూ లేరు గానీ, యెందుకలా అడిగారు?’ అన్నాడొకడు.
‘యేమీ లేదు—మీకు పులికథ చెపుదామని!’ అన్నాడు.
‘పులికథేమిటి? చెప్పండి….చెప్పండి’ అన్నారందరూ.
మనవాడు మొదలుపెట్టాడు—‘నేను మొన్నామధ్య వేటకి అడివిలోకి వెళ్ళినప్పుడు, హటాత్తుగా, చాలా దగ్గర్లో, గాండ్రింపు వినిపించింది! తీరా చూద్దునుగదా—నా ముందు సరిగ్గా ఓ యాభై గజాలలో ఓ పెద్ద పులి!’
‘అయ్యబాబోయ్! మరేమి చేశారు?’ అని అడిగారు.
తరవాత కథ మీకందరికీ తెలుసుగా?
దాదాపుగా ఇలాంటి సన్నివేశమే నాకెదురయ్యింది ఓ సారి!
ఓ ఇరవై యేళ్ళ క్రితం, మా బ్యాంకులో ‘కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరెటర్లుగా పని చెయ్యడానికి ఉత్సాహం వున్నవారు దరఖాస్తులు పెట్టుకోండి’ అన్నారు.
వాళ్ళకి ఇంగ్లీషులోనూ, లెఖ్ఖల్లోనూ చిన్న చిన్న పరీక్షలు పెట్టేవారు—అవి పాస్ అయినవాళ్ళని యెన్నిక చేసుకొనేవారు!
అలా యెన్నికైనవాళ్ళలో మా మల్లిఖార్జున ప్రసాద్ ఒకడు—‘చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్టు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కావలసిన సర్వీసు, ఇతర వాళ్ళడిగిన అర్హతలున్నవాడు, దరఖాస్తు పెట్టినవాడు మా చుట్టుపక్కల వాడొక్కడే! దానికి తోడు—పరీక్ష కూడా పాస్ అయ్యాడు మరి!
ఓక రోజు సాయంత్రం బ్యాంకు మూసేశాక, యెవరితోనో మాట్లాడాలని వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను.
అక్కడ మామూలుగా మీటింగులూ అవీ జరిగే బల్ల చుట్టూ ఓ పది మంది కొలీగ్స్ మధ్య మా ప్రసాద్ కూర్చొని, చెప్పేస్తున్నాడు.
‘……మనాఫీసులో వున్న ‘సగం’ గాడ్రెజ్ బీరువాలంత వుంటాయి కంప్యూటర్లు! అలాంటివి ఒక్కొక్కటి మన ఒక్కొక్క బ్రాంచికి సరిపోతాయి! మన హెడ్డాఫీసులోనైతే, ఓ పెద్ద రూమునిండా అలాంటి కంప్యూటర్లు వుంటాయి—అదే పెద్ద పెద్ద కంపెనీల్లో, ఓ బిల్డింగులో ఓ ఫ్లోర్ అంతా ఇలాంటి కంప్యూటర్లు వుంటాయి—నాసా వాళ్ళదగ్గరా, పెంటగాన్ లోనూ అయితే, పెద్ద నాలుగైదంతస్తుల బిల్డింగుల్లో అన్ని ఫ్లోర్లలోనూ కంప్యూటర్లే వుంటాయట………’ ఇలా అప్పటికే కాలక్షేపం అయిపోయిందట—తరవాత మిగిలినవాళ్ళు నాకు చెప్పి, ఒకటే నవ్వడం!
సరే, నేను వెళ్ళేటప్పటికి అవుతున్న టాపిక్—‘రేపు మన బ్యాంకులో వుపయోగించబోతున్నవి—బేసిక్, కోబాల్ మాత్రమే! మీక్కొంచం కష్టమేగాని, నాలాంటివాళ్ళకి కొట్టినపిండి—యెందుకంటే, ఇవి సాఫ్ట్ వేర్లు ! ఇంకా, పాస్కల్, ఫోర్ట్రాన్ లాంటివి వున్నాయి—ఇవన్నీ హార్డ్ వేర్లు—చెపితే నమ్మరు—మేము నేర్చుకునేటప్పుడు, కొట్టీ, కొట్టీ, కొట్టీ మా వేళ్ళు వాచిపోయేవి—వేళ్ళ కీళ్ళు చచ్చుబడిపోయేవి…..’
అప్పటికి నేను నిజం గా కంప్యూటర్ని చూడకపోయినా, ఓ పుస్తకాల పురుగుగా వాటిగురించి కనీస పరిఙ్ఞానాన్ని సంపాదించి వుండడంచేత—‘అహ్హహ్హహ్హా’ అని నవ్వాను!
‘యేంటిగురూ! అలా నవ్వుతావు?’ అనడిగాడు చిన్నబుచ్చుకొంటూ.
‘పులికథ బాగానే చెపుతున్నావుగానీ, మీ వూరివాళ్ళెవరైనా వున్నారేమో అడగడం మరిచిపోయావు కదా—అందుకని!’ అని నేనంటే—వుడుక్కున్నాడు!
తరవాత విషయాలు విని, అందరూ ‘పాపం వాడి గాలి అలా తీశేశారేమిటి’ అని ఒకటే నవ్వులు—వాడు పారిపోగానే!
ఇలాంటి తిప్పరాజులెందరో!