Saturday, May 23, 2009

కబుర్లు

మా కుమ్మరదాసుడు (మా బ్రాంచి మేనేజరుకి నేను పెట్టిన ముద్దు పేరు—యెందుకో ఆయన్ని చూడగానే మన అన్నమయ్య వ్రాసిన ‘కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి’ అన్న పదం నా మదిలో మెదిలింది లెండి!—అందుకే ఆ పేరు ఆయనకి ఖాయం చెసేశాను!--మా కొలీగ్స్ ఆ పేరుకి అలవాటు పడడానికి కొంత టైం పట్టిందనుకోండి—మొదట్లో, కొమ్మ దాసుడనీ, కుమ్మరి దాసరోడనీ—ఇలా వింత వింత కాంబినేషన్లు వేసేవారు! ఇప్పుడందరికీ అలవాటై పోయింది మరి) 18వ తేదీ పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళగానే, ‘సర్! చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయాడు చూడండి సర్!’ అన్నాడు నేను తన కేబిన్ లోకి ప్రవేసించగానే! [పదిన్నరకి మా బ్రాంచి తెరుస్తాం గానీ, ఓ అరగంట ముందే స్టాఫ్ అందరూ వచ్చేసి, ‘వీలు వెంబడి’ బ్రాంచి మేనేజరుని దర్శించుకొని (ఆ కేబిన్ లో ఏసీ వుంటుంది కదా!) ఉత్సాహంగా తాజా వార్తలగురించి చర్చించుకోవడం మా ఆనవాయితీ--ఇప్పుడు ఇక బ్రాంచీలు లేవు--'సర్వీస్ అవుట్లెట్ లు ' {ఎస్ ఓ ల్} లు తప్ప] ‘సర్! బంగారు ఉషా రాణి, 20 లక్షలు ఖర్చుపెట్టి కార్యకర్తలకి ‘హీరో’ లేటెస్ట్ మోబైక్ లు కొనిచ్చిందట! ఇంకేమి చిరంజీవి’ అన్నాను. పక్కనే వున్న మా డఫేదారు (సబ్ స్టాఫ్) ‘పోలింగు ముందు రాత్రే ‘ఫిక్స్’ అయి పోయిందట సార్! యెట్టి పరిస్థితుల్లోనూ, సుబ్బరాయుడు గెలవడానికి వీల్లేదు—మీరేమైనా చేసుకోండి అని చంద్రబాబు ‘కాపు ’లందరికీ చెప్పేశాడు!’ అన్నాడు! (మా నరసాపురానికి 10 కి. మీ. దూరం లో వుంది మొగలితుర్రు—అదే చిరంజీవి జన్మ స్థలం—అందుకే మా జనాలకి అంత ఆసక్తి!) ‘అవన్నీ కాదండి! మొదటినించీ కాంగ్రెస్ ఆధిక్యం లోనే వుంది! యెందుకంటారా—ముస్లిములు కాంగ్రెస్ కే, (వీళ్ళకి బాబ్రీ మసీదు, చంద్రబాబు బీజేపీ కి సపోర్టు కలల్లోకి వస్తూంటుంది) క్రిస్టియన్లు కాంగ్రెస్ కే, (రాశ్శేఖర్రెడ్డి క్రిస్టియన్, వాళ్ళ అల్లుడు ‘కూటములు’ పెట్టి మత, రాజకీయ, ధన ప్రబోధాలు చేశేసాడు) కాపులు చాలా మంది కాంగ్రెస్ కే, (రెడ్డొచ్చినా ఫర్వాలేదు—చౌదరోడు వస్తే మనకి ఉనికి వుండదు అని నమ్మిన వాళ్ళు—ముద్రగడ పద్మనాభమే ఓడిపోయాడు!) ఎస్ సీ లు, (మనం మనం ఒకటే!) వికలాంగులు, వృద్ధులు కాంగ్రెస్ కే (పెన్షన్లు ఇస్తున్నాడుగా!), ప్రభుత్వోద్యోగులు (తెలియని దేవత కంటే, తెలిసున్న రాక్షసి మేలు!), ఇంకా—జలయజ్ఞ్యంలో పాల్గొన్న కాంట్రార్లూ, వారికింద పనిచేసే సిబ్బందీ, పనివాళ్ళూ—ఇలా కొన్ని లక్షల మంది (లాభం పొందినవాళ్ళూ) అందరూ కాంగ్రెస్ కే వోటు వెయ్యక చస్తారా? అందుకే కాంగ్రెస్ వస్తుందని నేను నెల క్రితమే (పోలింగు మొదలవక ముందే) చెప్పాను—అన్నాడు మా బాల గంగాధర తిలక్! (చేసేది డఫేదారు ఉద్యోగమైనా, తను ‘కాపు ’ వర్గనికి చెందినా, రాజకీయ ‘పరిణతి’ పొందిన మా కొలీగ్ కి మేం పెట్టుకొన్న ముద్దు పేరు) ‘యేమీ కాదు సర్! మా వోట్లు మాకు పడ్డాయి, కాంగ్రెస్ వోట్లే చీలి పోయాయి! అది కూడా చిరంజీవి వైపు!’ అన్నాడు మా కామ్రేడు సుందరయ్య (ఆయన అసలు పేరు సత్యన్నారాయణ అయినా, ‘యెర్ర చొక్కా’ తొడుక్కుని, యెర్రెర్రగా మాట్లాడే మా కొలీగ్ ముద్దుపేరు)! ‘అసలు పోటీ మేధావి వర్గానికీ, మిగిలిన వాళ్ళకీ సర్! అందుకే మా లోక్ సత్తా కి ఇన్ని వోట్లు వచ్చాయి—త్వరలో మేం అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాం! మా జేపీ ఒక్కడే నెగ్గినా, అధికార ఎమ్మెల్ల్యేలందరికీ అప్పుడే గుండె దడ మొదలయ్యింది! టీవీ వాళ్ళు అప్పుడే ‘బ్రాండ్ ఎంబాసిడర్’ లని నియమించేసుకుంటున్నార్ట!' —అన్నాడు మా కేషియర్ వెంకట నాగభూషణం (ఈయన మా లోక్ సత్తా కన్వీనరుకి కుడి భుజమో, కుడి తొడో, కుడి ఇంకేదో—ట) ‘యేదైనా కానివ్వండి, ‘హిష్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్!’ అన్నాడు మా సర్వంబొచ్చు స్వామి (మా సబ్ మేనేజరు)! అంటే యేమిటో! (ఇంకా వుంది)