Saturday, August 29, 2009

కొంచెం లూజా?

దొడ్డుబియ్యం

భోజనానికి ఇంటికి వచ్చే సరికి మధ్యాన్నం రెండున్నర అయి పోయింది.  


‘వడ్డించేశాను! రండి!’ అన్న నా భార్యామణికి ఓ శుష్కహాసం చదివించి, చొక్కా వొక్కటే విప్పి, ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కొని, డైనింగ్ టేబులుదగ్గరకి చేరేసరికి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి, అన్నీ సిద్ధంగా వుంచింది మా శ్రీమతి.  


నిజం చెప్పొద్దూ—భోజనానికీ భోజనానికీ మధ్య మంచినీళ్ళు తప్ప, టీ కాఫీలూ వగైరా తాగడం, చిరుతిళ్ళు తినడం అసలు అలవాటు లేకపోబట్టి, ఆకలి నకనకలాడుతోంది! 


పొద్దున్న యేడు గంటలకి మా జోనల్ ఆఫీసునించి వచ్చిన ‘రికవరీ టీం’ తో జీపులో బయల్దేరాను—పొద్దెక్కితే జనాలు తమ తమ పనుల్లోకి వెళ్ళిపోతారాయే! ఇంటిదగ్గర వుండరు! మరి వాళ్ళ అడ్రెస్ లు మాత్రమే కలిగున్న మేము, వాళ్ళు ఇంటిదగ్గర లేకపోతే—ఇంకేమి రికవరీ?  


‘కెవ్వు’ అనరవబోయాను—అర్థాంగి కంచం లో వడ్డించిన పదార్థాలని చూసి.  


‘ఇవేమిటే?’ అన్నాను—గరిటెలోంచి కంచంలోకి జారిన పసుపురంగు ‘అర్థగోళీలని’ గమనించి.  


‘రాజన్న కందిపప్పు వద్దూ—మిగతా పప్పులు వండుకోండీ అన్నాడని, పిల్లలు కాలక్షేపానికి వేయించుకు తిండానికి తెచ్చుకున్న పసుపు బథాణీలని ముద్దపప్పు వండానండీ’ అంది.  


“మరి పప్పు’లు’ కనిపిస్తున్నాయేగాని, ముద్దేదే?” అంటే, ‘మీది మరీ చోద్యం!’ అంటూ అన్నం వడ్డించింది.  


మరొసారి ‘కెవ్వు’…..—ఇదేమిటీ! ‘గంజిగంజి గావున్న ఈ పెద్ద పెద్ద పదార్థాలేమిటీ?’ అనడిగాను.  


‘రాజన్నా—దొడ్డు బియ్యం వండుకోండీ—సన్న బియ్యమే అక్కర్లేదూ అన్నాడు గదాని, అవే తెచ్చాను మన షావుకారు కొట్లోంచి.’ అని వడ్డించింది.  


కలుపుకోడానికి ప్రయత్నం చేస్తూ—‘అయితే 15-50 కే దొడ్డు బియ్యం ఇచ్చారన్నమాట?’ క్రొశ్నించాను.  


“మీరు భలే క్యామెడీగా మాట్లాడతారండీ—రాజన్నకైతే వదిన చెప్పగానే, సూరీడు తెలంగాణా శకుంతల లెవెల్లో—‘ఒరే పిచ్చిరెడ్డీ! పెంట్రెడ్డీ! యెరుకల్రెడ్డీ! యానాదిరెడ్డీ! బండ్లు తియ్యండ్రా!’ అంటూ ఓ పాతిక సుమోల్లో బయలుదేరితే, బస్తాలకి బస్తాలు దొడ్డు బియ్యం వాళ్ళకి (కేజీ 15-50 చొప్పున బిల్లులతోసహా) చదివించి, ‘దయవుంచన్నా’ అని యెదురు కేజీకి పదో పరకో ముట్టచెపుతారుగానీ, మనకి యెవరిస్తారండీ? షావుకారు కేజీ 20 రూపాయలకమ్ముతున్నాము—మీక్కాబట్టి 19-50 కి ఇస్తాను అని ఇచ్చాడండి!” అంది.  


అప్పటికి ఆ అన్నాన్నీ పప్పునీ కలపలేక పక్కకి తోసేసి, ‘పచ్చడేమైనా వెయ్యి’ అంటే, ఓ చిన్న గిన్నెలోంచి అదేదో ఆకుపచ్చని జిగురు పదార్థాన్ని చెంచాతో వడ్డించింది!  


‘ఇదేం పచ్చడి?’ అనడిగితే—“మరిచాను—చింతపండుకూడా ప్రియం అయిపోయింది—నిన్న ఈనాడులో యెవరో చింతపండుకి బదులుగా ‘చైనా నిమ్మకాయల్ని’ యెండబెట్టి గుజ్జుతీసి వాడుతున్నాను’ అని చెప్పింది. మనకి చైనా నిమ్మకాయలు లేవుకదా అని, బ్రిలియంట్ గా ఆలోచించి, మన దొడ్లోని నిమ్మా, నారింజా, కమలా, పంపరపనసా ఆకుల్ని—అవి యెంత పుల్లగా వున్నాయో—చింతపండుకి బదులుగా మిక్సీలోవేసి, మనదొడ్లోనే వున్న కరేపాకునీ, రెండు పచ్చి మిరపకాయల్నీ, వుప్పునీ వేసి పచ్చడి చేశాను! అందులో రాజన్న చెప్పినట్లు కాసిని పచ్చి బటానీలనికూడా వేశానండోయ్! మీరే అంటారుగా—‘వుప్పూ, కారం, చింతపండూ సమపాళ్ళలో తగిలితే, గడ్డితోకూడా రుచికరమైన పచ్చడి చెయ్యొచ్చు!’ అని”  


పాతాళభైరవిలో తోటరాముడు ప్రవేశించిన, కత్తులు తిరుగుతున్న మార్గం లో లాంటి కత్తులు నా మెదడులో తిరుగుతున్నట్టు అనిపిస్తూండగా—‘బాగుంది గానీ, మరి చారూ, పులుసూ లాంటివి యేమన్నా…….?’ అని నసుగుతూంటే….  


భార్యామణి, మరో గిన్నెలోంచి మరో చిప్ప గరిటెతో—ఓ బూడిదరంగు ద్రవ/ఘన పదార్ధాన్ని వడ్డించబోతూంటే, ‘ఇదేమేటే?’ అనడిగాను.  


‘వులవ పప్పులుసండీ’ అంది!  


‘వులవ చారు విన్నాం—వులవల్ని వుడికించిన నీళ్ళతో పెడతారు—వులవల్ని పశువులకి తినిపిస్తారు—ఈ వులవ పప్పులుసు యెక్కడిదీ?’ అన్నాను దీనం గా.  


“భలేవారే! రాజన్నేం చెప్పాడు? కంది, పెసర, మినప, శెనగ పప్పుల్తప్ప, ఇంకే పప్పులైనా వుపయోగించుకోండి—ధరలెందుకు తగ్గవో నేను చూస్తాను—అన్లా? అందుకే………..ఇంకా ఈనాడులో కూడా వులవలూ, బొబ్బర్లూ, అలచందలూ, గోరుచిక్కుడూ--ఇలాంటి వాటితో చేసుకోగల విచిత్ర వంటకాలన్నీ ప్రచురిస్తున్నారు కదా!”  


‘నీ రాజన్నో!’ అని మనసులో అనుకుంటూ, 'చెల్లెలు సబితని హోం మంత్రిని చేసినట్టు, నిన్నుకూడా యే వంటల మంత్రో చేసేస్తాడేమో! పోనీ వూరగాయలేమన్నా…………’ నసిగాను.  


‘అయ్యయ్యయ్యో! చిన్న జాడీలలోకి తీసినవన్నీ నిన్ననే అయిపోయాయి—ఇవాళ పొద్దున్న తీద్దాములే అనుకున్నాను—తీరా చేసి, ఇవాళ కాస్త ముక్కు బురుబుర్లాడుతూంటే, తల స్నానం చెయ్యలేదు—తలస్నానం చెయ్యకుండా వూరగాయ జాడీలు ముట్టుకోడమెందుకనీ……..!’ అంటొంది.  


‘పోనీలే—కాస్త మజ్జిగపోసెయ్యి’ అని, ఆ జిగట జిగట మజ్జిగ్గంజి అన్నాన్ని రెండు ముద్దలు నోట్లో వేసుకొని మింగినట్టు నటించి, చెయ్యి కడిగేసుకొంటూంటే, నా ధర్మపత్ని, ‘పాపిష్టిదాన్ని! అర్థాకలితోనే లేచిపోతున్నారు!’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొంటూంటే  


‘పిచ్చిదానా! మొగుడు అర్థాకలితో లేస్తే పాపం గానీ, పూర్ణాకలితో లేస్తే పాపమేమీ కాదు! వూరుకో!’ అన్నాను.  


‘ఈ సారి ఆ పాపిష్టివాడికి వోటేస్తే వొట్టు’ అంటూంటే  


‘ఇదేదో తెనాలిరామలింగడి పిల్లి వ్యవహారం లాంటిదని నేననుకుంటాను గానీ, మన పెళ్ళయిన గత 35 యేళ్ళలో ఇవన్నీ మనకి మామూలే కదా? పైగా రాష్ట్రం లో అందరు ఆడాళ్ళూ చేస్తున్నదే నువ్వూ చేశావు—అంతే!’ అన్నాను.  


(మనసులో ‘మీ రాజన్న సలహాలకి పాడెకట్ట!’ అనుకున్నాననుకోండి!)  


అదీ సంగతి!



Saturday, August 22, 2009

కరవు చర్చ

కరవా మజాకా
‘బావా! నీ కొలువుకూటము రాను రాను రణరంగ మగుచున్నదేమయ్యా?’ అంటూ ప్రవేశించాడు—మా ‘తక్కెళ్ళ రెడ్డి’--నిన్నటి అసెంబ్లీలో కన్నా వేడి వేడి గా జరుగుతున్న మన ‘రాష్ట్రం లో కరువు’ గురించి మా 'సోల్ ' లో జరుగుతున్న చర్చలోకి!
అన్నట్టు మా కుమ్మరదాసుడికి బదిలీ అయిపోయి, ఈ ‘టీ’ ఇంటిపేరుగల ‘అదేదో’ రెడ్డి బ్రాంచి మేనేజరుగా వచ్చాడు. ఆయనకి మేము పెట్టుకున్న ముద్దు పేరు ‘తక్కెళ్ళ రెడ్డి!’ ఆయనకి సందర్భానుసారం ‘కురుక్షేత్రం’ నాటకం లోని పద్యాలు వాడుకోవడం ఓ సరదా.
వాళ్ళ వూరు తక్కెళ్ళపాడు కాకపోయినా, ‘చాలా బ్యాలెన్సుడు గా వుంటాడు’ అని ఇష్టపడేవాళ్ళూ, ‘తక్కెడలా కాసేపొకవైపూ, ఇంకాసేపు ఇంకొకవైపూ వుంటాడు’ అని ఇష్టపడనివాళ్ళూ అంటారు.
‘అదికాదు బావా! నీదేమైనా నాలుకా—తాటి పట్టా? ఓ పక్క మీనం తరవాత మేషమా, మేషం తరవాత మీనమా, అదెన్నోది, ఇదెన్నోది అని లెక్ఖెట్టుకుంటావా! మరో పక్క వెకిలి నవ్వు నవ్వుతూ మీరు ప్రజలని భయపెట్టకండి—మేము కమిటీలు వేశాము, సరియైన సమయం లో కరువుని ప్రకటిస్తాము—అసలు ప్రకటించినా, ప్రకటించకపోయినా తేడా యేమీ లేదు—అంటావా?’—అనరిచాడు—మా సుందరయ్య.
‘నేనా?’ అని దీనం గా మా తక్కెళ్ళ రెడ్డి అడుగుతూంటే, అందరూ ఫక్కున నవ్వి, వాతావరణం కాస్త చల్లబడింది!
“మొదట ‘ఆగష్ట్ మొదటివారం లో అందరూ విత్తనాలు చల్లుకుంటారు—అది పూర్తయితేగానీ, బ్యాంకులు ఋణాలు ఇవ్వవు—అందుకని ఆగాం!’ అన్నాడు—యే బ్యాంకైనా రైతులు విత్తనాలు చల్లారా లేదా పరిశీలించి మాత్రమే పంట ఋణాలు ఇస్తోందా? అసలు సారవా కి జూన్ నెలలోనే ఋణాలు ఇవ్వడం మొదలెట్టేస్తారు కదా?” అన్నాడు మా బాలగంగాధర తిలక్.
“చూడండి! ‘మనం ఇప్పుడే ప్రకటిస్తే, బ్యాంకులు ఇంక ఋణాలు ఇవ్వవు—అందుకే—అందరూ ఋణాలు తీసుకునేవరకూ ఆగాలి’ అన్నాడు తరవాత! అంటే, అందరూ ఋణాలు తీసుకున్న తరవాత యే మాఫీయో ప్రకటిద్దాం, అప్పుడు పోయేవి బ్యాంకులూ, పడే వోట్లు మనకీ అనేనా?” అన్నాడు మా కేషియర్ వెంకట నాగభూషణం.
“తరవాత ‘రేపు జరగబోయే బ్యాంకర్ల సమావేశం లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు—అందుకని అదయ్యేవరకూ ఆగాల్సిందే’ అన్నాడు—బ్యాంకర్ల మీటింగుకీ, కరువుకీ యేమిటి సంబంధం అసలు?” క్రొశ్నించాడు మా బాలగంగాధర తిలక్.
“మూడో వారం వచ్చేటప్పటికి, ‘అసలు ప్రకటించనే ప్రకటించం—యెడం చెయ్యి పెట్టినా, పుర్రచెయ్యి పెట్టినా తేడా యేముంది? ప్రతిపక్ష రాజకీయం కాకపోతే? మీకేమి కావాలో చెప్పండి—విత్తనాలా? ఇస్తాము, నీళ్ళా? ఇస్తాము, యెరువులా? ఇస్తాము, గడ్డా? యేర్పాటు చేస్తాము, గొర్రెలా? ఇప్పిస్తాము, బర్రెలా? ఇప్పిస్తాము, ఇంకేమి కావాలి కరవుని యెదుర్కోడానికి? మరెందుకు ప్రకటన?’ అంటున్నాడు! మరి ఇప్పటికే ప్రకటించిన రాష్ట్రాలూ, సహాయం ప్రకటించిన కేంద్రం, పర్యటిస్తున్న కేంద్ర అంచనా బృందాలూ, ఇవన్నీ మిథ్యా? వాళ్ళందరూ వెర్రివాళ్ళా? యెవరి చెవుల్లో పువ్వులు పెడతాడు?” అంటూ మళ్ళీ రగిలిపోయాడు మా కామ్రేడ్ సుందరయ్య.
“అవన్నీ కాదు—తీరా ప్రకటించాక, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అనుభవాలు యెదురై, కేంద్రం మొండిచెయ్యి చూపిస్తే, వాళ్ళతో దెబ్బలాడే మొగాడు యెవడూ లేడుకదా—అందుకని భయం!” అన్నాడు మా వెంకట నాగభూషణం.
“పిచ్చివాళ్ళలారా! అసలు రహస్యం నేచెప్పనా? మన తెలుగువాడెవరైనా, పదిమందితోపాటు ‘జై’ అంటున్నా, ‘తొయ్’ అంటున్నా, ప్రతివాడికీ తనకే ప్రత్యేకమైన ఒక ‘స్వంత అజెండా’ వుంటుంది! అదే వాడికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం! అర్థమయ్యిందా?” అన్నారు చిద్విలాసం గా మా సర్వంబొచ్చు స్వామి!
ఇంకెవరైనా మాట్టాడితే వొట్టు!
నా అలవాటు ప్రకారం నా సిగరెట్టు నేను కాల్చుకుంటూ చిరునవ్వుతో వుండిపోయాను--చర్చ రగలేసిన నేను!

Friday, July 31, 2009

తిప్పరాజు.....

......ఫులికథ!
ఒక వూరిలో రచ్చబండదగ్గర మరో వూరినించొచ్చిన ఓ తిప్పరాజుగారు చుట్టూ వున్న జనానికి వినోదం కలిగిస్తూ మంచి కథా కాలక్షేపం చేస్తున్నారు—‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ లాంటి కబుర్లతో, జనాలు ‘ఆహా! ఓహో’ అంటుండగా!
‘ఇక్కడ మా వూరివాళ్ళు యెవరైనా వున్నారా?’ అని అడిగాడు హటాత్తుగా.
‘యెవరూ లేరు గానీ, యెందుకలా అడిగారు?’ అన్నాడొకడు.
‘యేమీ లేదు—మీకు పులికథ చెపుదామని!’ అన్నాడు.
‘పులికథేమిటి? చెప్పండి….చెప్పండి’ అన్నారందరూ.
మనవాడు మొదలుపెట్టాడు—‘నేను మొన్నామధ్య వేటకి అడివిలోకి వెళ్ళినప్పుడు, హటాత్తుగా, చాలా దగ్గర్లో, గాండ్రింపు వినిపించింది! తీరా చూద్దునుగదా—నా ముందు సరిగ్గా ఓ యాభై గజాలలో ఓ పెద్ద పులి!’
‘అయ్యబాబోయ్! మరేమి చేశారు?’ అని అడిగారు.
తరవాత కథ మీకందరికీ తెలుసుగా?
దాదాపుగా ఇలాంటి సన్నివేశమే నాకెదురయ్యింది ఓ సారి!
ఓ ఇరవై యేళ్ళ క్రితం, మా బ్యాంకులో ‘కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరెటర్లుగా పని చెయ్యడానికి ఉత్సాహం వున్నవారు దరఖాస్తులు పెట్టుకోండి’ అన్నారు.
వాళ్ళకి ఇంగ్లీషులోనూ, లెఖ్ఖల్లోనూ చిన్న చిన్న పరీక్షలు పెట్టేవారు—అవి పాస్ అయినవాళ్ళని యెన్నిక చేసుకొనేవారు!
అలా యెన్నికైనవాళ్ళలో మా మల్లిఖార్జున ప్రసాద్ ఒకడు—‘చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్టు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కావలసిన సర్వీసు, ఇతర వాళ్ళడిగిన అర్హతలున్నవాడు, దరఖాస్తు పెట్టినవాడు మా చుట్టుపక్కల వాడొక్కడే! దానికి తోడు—పరీక్ష కూడా పాస్ అయ్యాడు మరి!
ఓక రోజు సాయంత్రం బ్యాంకు మూసేశాక, యెవరితోనో మాట్లాడాలని వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను.
అక్కడ మామూలుగా మీటింగులూ అవీ జరిగే బల్ల చుట్టూ ఓ పది మంది కొలీగ్స్ మధ్య మా ప్రసాద్ కూర్చొని, చెప్పేస్తున్నాడు.
‘……మనాఫీసులో వున్న ‘సగం’ గాడ్రెజ్ బీరువాలంత వుంటాయి కంప్యూటర్లు! అలాంటివి ఒక్కొక్కటి మన ఒక్కొక్క బ్రాంచికి సరిపోతాయి! మన హెడ్డాఫీసులోనైతే, ఓ పెద్ద రూమునిండా అలాంటి కంప్యూటర్లు వుంటాయి—అదే పెద్ద పెద్ద కంపెనీల్లో, ఓ బిల్డింగులో ఓ ఫ్లోర్ అంతా ఇలాంటి కంప్యూటర్లు వుంటాయి—నాసా వాళ్ళదగ్గరా, పెంటగాన్ లోనూ అయితే, పెద్ద నాలుగైదంతస్తుల బిల్డింగుల్లో అన్ని ఫ్లోర్లలోనూ కంప్యూటర్లే వుంటాయట………’ ఇలా అప్పటికే కాలక్షేపం అయిపోయిందట—తరవాత మిగిలినవాళ్ళు నాకు చెప్పి, ఒకటే నవ్వడం!
సరే, నేను వెళ్ళేటప్పటికి అవుతున్న టాపిక్—‘రేపు మన బ్యాంకులో వుపయోగించబోతున్నవి—బేసిక్, కోబాల్ మాత్రమే! మీక్కొంచం కష్టమేగాని, నాలాంటివాళ్ళకి కొట్టినపిండి—యెందుకంటే, ఇవి సాఫ్ట్ వేర్లు ! ఇంకా, పాస్కల్, ఫోర్ట్రాన్ లాంటివి వున్నాయి—ఇవన్నీ హార్డ్ వేర్లు—చెపితే నమ్మరు—మేము నేర్చుకునేటప్పుడు, కొట్టీ, కొట్టీ, కొట్టీ మా వేళ్ళు వాచిపోయేవి—వేళ్ళ కీళ్ళు చచ్చుబడిపోయేవి…..’
అప్పటికి నేను నిజం గా కంప్యూటర్ని చూడకపోయినా, ఓ పుస్తకాల పురుగుగా వాటిగురించి కనీస పరిఙ్ఞానాన్ని సంపాదించి వుండడంచేత—‘అహ్హహ్హహ్హా’ అని నవ్వాను!
‘యేంటిగురూ! అలా నవ్వుతావు?’ అనడిగాడు చిన్నబుచ్చుకొంటూ.
‘పులికథ బాగానే చెపుతున్నావుగానీ, మీ వూరివాళ్ళెవరైనా వున్నారేమో అడగడం మరిచిపోయావు కదా—అందుకని!’ అని నేనంటే—వుడుక్కున్నాడు!
తరవాత విషయాలు విని, అందరూ ‘పాపం వాడి గాలి అలా తీశేశారేమిటి’ అని ఒకటే నవ్వులు—వాడు పారిపోగానే!
ఇలాంటి తిప్పరాజులెందరో!

Monday, July 27, 2009

కందిపప్పు

పప్పులుడుకుతున్నాయి
(కాకినాడలో, రెండిళ్ళమధ్య వున్న ప్రహరీగోడకిరుప్రక్కలా వున్న మహిళల సంభాషణ)—
‘పనైపోయిందా వదినా? యేమి వండావు?’
‘అయినట్టేనమ్మ! చారు మరుగుతోంది—కరేపాకు రెబ్బలకోసం దొడ్లోకి వచ్చాను!’
‘చాలానే వండినట్టున్నావే? ఇవాళ ఆదివారమొకటి కదా!’
‘అదే వండడం వొదినా—మీ అన్నయ్య సంగతి తెలుసుగా—వారం రోజులూ గాలితో బ్రతికినట్లు—ఆదివారం వారం రోజుల భోజనం ఒకేసారి చేస్తారు!
అందుకనే—ఓ పదహారు కందిపప్పులు జాగ్రత్తగా దాచి, ఇవాళ పదికట్టల గోంగూరలో వేసి పప్పు చేశాను! మొన్న రేటు తక్కువున్నప్పుడు ఓ వందగ్రాములు దొండకాయలు తీసుకున్నాలే—వాటిని కాస్త బెల్లం పెట్టి కూర చేశాను! పోపుల పెట్టెలో ఓ నలభై రెండు శనగపప్పులుంటే, కాస్త కారం, చింతపండూ వేసి, పచ్చడి చేశాను—నాలిక్కి రాసుకోడానికి! ఊరగాయలు యెలాగా వున్నాయి—ఇక చారు, మజ్జిగ—మామూలే! ఇంతకీ నువ్వేమి వండావు?’
‘నేనా వదినా—నీలా ముందుచూపు లేకపోయింది నాకు—కాసిని కంది బద్దలూ, శనగబద్దలూ నిలవెయ్యలేకపోయాను! అయినా, మా దొడ్లో తోటకూర వుందిగా, దాన్ని జీడిపప్పులో వేశాను! కూరకి, ఆనపకాయ ముక్క, నువ్వుపప్పులో వేశాను! పచ్చడికి వేరుశనగ వాడాను! పులుసులోకి, బాదం పప్పు వేశాను! నువ్వన్నట్టు వూరగాయలు వున్నాయి—మజ్జిగ మామూలే!’
‘ఇవన్నీ యెప్పుడు నేర్చావొదినా? నాకు తెలియలేదే?’
‘పిచ్చిదానా! యెప్పుడైనా వంటచెయ్యడానికి బధ్ధకం వేసినప్పుడు మన సుబ్బయ్య హోటల్ నించి ఓ బుట్ట తెప్పించుకుంటాం కదా? వాడు అన్నిట్లోనూ జీడిపప్పులూ, బాదం పప్పులూ, నువ్వుపప్పులూ వేసేస్తున్నాడు అని విసుక్కొని, ఇక తెప్పించడం కూడా మానుకున్నాం కొన్నాళ్ళనించీ—ఇప్పుడవే అక్కరకొస్తున్నాయి మరి!’
(యెలక్షన్లకి ముందు వున్న రేట్లతో పోలిస్తే, కంది, శనగ, పెసర, మినప్పప్పూ, చింతపండూ విపరీతం గా పెరిగాయిగానీ, జీడి పప్పూ, బాదం పప్పూ, నువ్వు పప్పూ, వేరుశనగ పప్పూ పెద్దగా పెరగలేదు—అందుకని అందరూ ఇవే వండుకుంటే పోతుందిగదా—వెరైటీగానూ వుంటుంది, ఖరీదైన భోజనం చేసినట్టూ వుంటుంది!)
(పప్పులలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతోంది—నూనె గింజల్లో బ్యాన్ కొనసాగుతోంది!)

Sunday, June 28, 2009

'శ్రీ శ్రీ శ్రీ........

......శ్రీ పీతన్న!
రానే వచ్చారు—చెయ్యెత్తుమనిషి, ఒడ్డుకుతగ్గ లావు, పూర్తి బట్టతలా, వెనక చుట్టూ తెల్లని జుట్టూ, విశాలమైన నుదుటిమీద పట్టెవర్ధనాలూ, తెల్లని లాల్చీ, పెద్దంచు చేనేత లుంగీ, భుజమ్మీద వేళ్ళాడే సంచీ, మందపాటి టైరుచెప్పులూ—లాల్చీ విప్పితే లోపల సైనుగుడ్డతో కుట్టించిన కబ్బా (చేతుల్లేని బనియను)—ఇదీ ఆయన ఆహార్యం!
మామూలుగానే మర్యాదలు జరుగుతున్నాయి—మూడు పూటలా—ఫలహారాలతో సహా!
‘ఒరే కృష్ణుడూ—గురువుగారి పేరే పెట్టాడు నీకు మీ నాన్న’—అని నన్ను ముద్దు చేశేవాడు!
స్నానానికి వెళ్ళి, మా పిల్ల కాలవలో నీళ్ళ మీద తేలుతూ ఓ అరగంట శవాసనం వేస్తే, జనాలందరూ విచిత్రంగా చూసి, గట్టు మీదనించే దణ్ణం పెట్టుకొని వెళ్ళిపోయేవారు!
ఓ వారం గడిచింది—భూదేవిలాంటి మా అమ్మకీ కాస్త సహనం తగ్గింది—ఇంకెన్నాళ్ళు వుంటాడో ఈయన? ఓ పక్క సంబారాలు చూసుకోవాలి, ఓ పక్క చాకిరీ—యెలాగో లాక్కురావాలి—అనుకొంటోంది!
అనుకోకుండా తన నోటినించి వచ్చేసింది ‘పీతన్నగారి స్నానం అయిందేమో చూడరా’ అని!
అప్పటిదాకా ‘శ్రీ పీతాంబరధరుడు గారు’ అనలేక చచ్చేవాళ్ళం—ఇప్పుడు నాకు హుషారు— ‘పీతన్నగారు! పీతన్నగారు!’ అంటూ హుషారుగా పరిగెట్టాను—పిల్లకాలవ వంతెనమీదకి!
ఇంకో వారం గడిచింది—నెలాఖరు! మా భూదేవి సహనం భూకంపానికి కొంచెం తక్కువగా వుంది—వెచ్చాలన్నీ మా ఇంటిపక్క వెంకటస్వామి కొట్లో అరువు తేవలసి వస్తోంది, కూరగాయలు, నెయ్యి వగైరా తెచ్చే అమ్మిలకి, ‘ఫస్ట్ కి ఇస్తాన్లే’ అని చెప్పాల్సి వస్తోంది—వీటికితోడు కొంత నీరసం!
యేమాటకామాటే చెప్పుకోవాలి—ఆయన వచ్చిన రోజు యెలా జరిపించిందో, ఈ రోజున కూడా అలాగే జరిపిస్తోంది—చిన్నమెత్తు లోటు కూడా జరగకుండా! ఆయన్ని ‘ఒరే’ అనేంత చనువూ యేర్పడింది—నిజం గా అనకపోయినా!
ఆఖరికి ఆ రోజు అననే అంది నాతో ‘ఒరే! పీతిగాడి స్నానం అయ్యిందో లేదో చూడరా!’ అని!
యెదురుగా వున్న మా నాన్న, కళ్ళెర్రజేస్తూనే ఫక్కున నవ్వారు! నేను ‘పీతిగాడు! పీతిగాడు!’ అని గెంతుకుంటూ వెళుతూంటే!
ఆ రోజు భోజనాలు అవుతూండగా, మా నాన్న, ‘అయ్యా! గురువుగారు భీమడోలులో రేపటినించీ వుపన్యాసాలిస్తారు కదా! నేను రావడానికి కుదరడంలేదు! రేపో, యెల్లుండో వస్తాను. ముందుగా మీరు వెళితే బాగుంటుంది కదా?’ అన్నారు.
పీతన్నగారికి కోపం యేమైనా వచ్చిందో లేదో ఆయన ముఖ కవళికలనించి మాకేమీ తెలియలేదు గానీ, ఆ సాయంత్రం, ‘ఇక నేను వెళ్ళి వస్తానోయ్!’ అనగానే మేమందరం మనసులోనే ‘హమ్మయ్య’ అనుకున్నాము!
(ఇది మా అమ్మ నా చిన్నప్పుడు యెక్కడో చదివి వినిపించిన ఉదంతమే! నిజం గా మా యింట్లో జరిగింది కాదు! హాస్యానికి ఇలా అన్వయించాను!)

Saturday, June 27, 2009

'శ్రీ శ్రీ శ్రీ......

శ్రీ పీతాంబరధరుడు!
మా నాన్నగారు ఆధ్యాత్మికం గా అనేక పురాణాలూ అవీ చదివి, సంస్కృతం లో వాటి గురించి ఆలోచించేవారు! ఆయనకో ‘గురువుగారు ’ వుండేవారు.
ఆయనకోసం ఆయన ‘ఆధ్యాత్మిక స్నేహితులు‘ అంటే గురువుగారి ఉపన్యాసాలకి వచ్చేవాళ్ళు, ఆయన మిగతా శిష్యులూ—ఇలా అన్న మాట!—అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూండేవాళ్ళు!
పాపం మా పిచ్చి అమ్మ, అలాంటివాళ్ళు యెవరైనా ఇంటికి రాగానే, అత్యంత భక్తితో, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి, తుడుచుకోడానికి తుండుగుడ్డ ఇచ్చి, అరుగుమీద పడక కుర్చీ వేసి కూర్చోబెట్టి, త్రాగడానికి మంచి తీర్థం ఇచ్చి, ‘పది నిమిషాల్లో వంట అయి పోతుంది—ఈలోపల కాస్త చల్ల ఇమ్మంటారా?’ అని అడిగి, పెద్దగ్లాసునిండా చల్లని చల్ల అందించి, వంటింట్లో జొరబడేది, విసురుకోడానికి ఓ విసినికర్ర ఇచ్చి!
సరిగ్గా అయిదు నిమిషాల్లో మళ్ళీ వచ్చి, ‘వడ్డించేస్తాను—మీరు మడి కట్టుకోండి—నూతిదగ్గర స్నానం చేసినా సరే, లేదా పక్కనే కాలవ వుంది అక్కడైనా సరే!’ అనగానే, ఒకాయన ‘ఇంకా ఆకలి లేదమ్మా, కాలవకే వెళతాను’ అని వెళ్ళి, కాసేపు ఈతకొట్టి, ఆసనాలు వేసి, అనుష్ఠానాలు పూర్తి చేసుకొని వచ్చి, పీట మీద కూర్చొని, చక్కగా మారు అడిగి మరీ వడ్డింపించుకొని, తృప్తిగా తిని, చెయ్యి కడిగి, అమ్మ ఇచ్చిన తాంబూలం వేసుకొని, అలవాటు లేకపోతే, వక్కపొడి చాలమ్మా అని, మళ్ళీ అరుగు మీద మడత మంచం మీద చేరేవారు!
నాన్న స్కూలు నించి వచ్చాక, ఆధ్యాత్మిక చర్చల్లో రాత్రి అయిపోతే, మల్లీ రాత్రి కూడా భోజనాలు చేసి, ‘పొద్దున్నే ఫస్టు బస్సుకి వెళ్ళిపోతానోయ్!’ అంటూ ఆరుబయట నిద్రపోయేవారు!
(ఆయనెప్పుడు లేచాడో, యెప్పుడు వెళ్ళిపోయేడో మాకు తెలిసేది కాదు!)
అలాంటి రోజుల్లో, ఒక రోజు కబురు వచ్చింది ‘శ్రీ పీతాంబరధరుడు గారు వస్తున్నారు!’ అని! --
(ఇంకా వుంది)

Thursday, June 25, 2009

మా ఆస్థాన 'మంత్రి '

నా అయిదోయేడు నడుస్తున్న మనవడు (అట్లాంటావాడు) మొన్న ఓ జోక్ పేల్చాడు!
నేను మామూలుగా మా ఆస్థాన 'మంత్రి ' చేత గడ్డం గొరిగించుకొని, అలవాటుగా చెయ్యి పైకెత్తాను, మా మంత్రి 'చంక ' గొరిగేస్తున్నాడు!
యక్కడనించి చూశాడో నా మనవడు, వాళ్ళమ్మతో అంటున్నాడు, "అమ్మా! బుద్ధీష్ తాత తన 'చంకలో కూడా గుండు' చేయించుకుంటాడా?" అని!
మరి ఇలాంటి ఊహలు ఈ జనరేషన్ కి యెలా వస్తున్నాయో!