Friday, January 15, 2010

కీప్ వాచింగ్........



సాగేశ్న నిత్య నారాయణ యాజు


"ఇక నా రేపటి 'క్షుద్ర రహస్యాలు '--387 వ ఎపిసోడ్ లో  


'నిశాచరులకి నిమ్మకాయలంటే ఇష్టమా? భయమా'?  


తప్పక చూడండి!"

Friday, January 8, 2010

రికార్డు


'అన్నీస్' రికార్డు


నా ప్రశ్నలకి సమాధానం:-  


1. 'తదితరులు'  


2. 'మున్నగువారు'  


3. 'మొ. వారు'  


వీళ్ళు నటించని సినిమాగానీ, పాల్గొనని ఫంక్షన్ గానీ ఇప్పటివరకూ ప్రపంచం లో లేదు!  


అంతెందుకు--ఎలక్షన్లలో ఫలితాన్ని ప్రభావితం చేసేది కూడా వీళ్ళే!




Thursday, January 7, 2010

రికార్డు



'అన్నీస్' రికార్డు


ఈ ప్రపంచం లో ఇప్పటివరకూ తీసిన 'అన్ని సినిమాలలో' నటించినవారు, ప్రతీ దేశం లో, ప్రతీ మీటింగులో, ప్రతీ ఫంక్షన్ లో పాలుగొన్నవాళ్ళు--అత్యధికం గా--యెవరు?  


1, 2, 3 ఇలా రేటింగులు ఇవ్వండి............!


O kay?

Sunday, December 20, 2009

ముదావహం

తడబాటు


మా వూరి మునిసిపల్ చైర్మన్ గారు వుండేవారు--ఆ రోజుల్లో మొదటిసారిగా లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు ఎలక్షన్లలో! డబ్బైతే బాగా సంపాదించాడు, తెలివైనవాడు--కాని కాస్త చదువే తక్కువ--తడబాటు యెక్కువ!  


యేదైనా స్పీచ్ ఇవ్వవలసి వస్తే ఆయనతో కలిసి చదువుకున్నవాళ్ళలో కొంత తెలివైనవాళ్ళని సలహా అడిగి, పాయింట్లు చిన్న కాయితమ్ముక్కమీద వ్రాసుకొని, పాయింటుకి అనుగుణం గా వుపన్యాసం కొనసాగించేవాడు.  


మా వూరి ప్రజల అదృష్టం కొద్దీ, ఓ సారి ఘంటసాలవారు వచ్చారు--వారికి సన్మానం! అధ్యక్షులు--శ్రీ చైర్మన్ వారే!  


అధ్యక్షుని తొలిపలుకుల్లో 'ఈయన ఘంటసాలగారు--ఈయన తెలియనివాళ్ళు యెవరూ వుండరు--ఈయన పాట విననివాళ్ళు వుండరు! మీకు మరోసారి గుర్తుచేస్తున్నా--మన సినిమాలలో, నాగేశ్వరరావుకీ, రామారావుకీ, రేలంగోడికీ, సావిత్రికీ--ఇలా అందరికీ పాటలు పాడేది--ఇంకెవరు? ఈయనే!' జనాలు ఘొల్లున నవ్వుతున్నా, ఇలా సాగింది ఆయన వుపన్యాసం!  


తరువాత మరోవక్త, ఆయనని కవర్ చెయ్యలని, 'మన చైర్మన్ గారు చెప్పింది నిజంగా నిజం--ఘంటసాలవారు సావిత్రికి కూడా పాడారు--మాయాబజార్ సినిమాలో, అహనాపెళ్ళంట అంటూ' అనగానే, అప్పుడు పండింది అసలు కామెడీ--ముందు ఆయన మాట్లాడినప్పుడు గమనించనివారుకూడా, ఇప్పుడు గ్రహించి, చప్పట్లే చప్పట్లు!  


పాపం ఆయనకి కాస్త కన్ఫ్యూజన్ యెక్కువ--ముఖ్యం గా 'ముదావహం' 'శోచనీయం' అనే రెండు పదాలు నేర్చుకున్నాడు గానీ వాటిని వాడడం లో తడబడేవాడు!  


ఓ సంతాప సభలో, 'ఈ రోజు ఫలానావారు--నిన్నటివరకూ మన మధ్యనేవున్నవారు--ఇప్పుడు మనమధ్య లేకపోవడం చాలా ముదావహమైన విషయం! ప్రభుత్వం వారు ఆయన సేవలని ఇన్నాళ్ళూ గుర్తించకపోవడం ఇంకా ముదావహం! గుడ్డిలో మెల్లగా ఈ మధ్యనే ఆయనకి పదవోన్నతి ఇవ్వడం మాత్రం నిజంగా శోచనీయం!............' అంటూ, వెనకవున్నవాళ్ళు గోకుతున్నా, పావుగంటలో పదహారు ముదావహాలూ, శోచనీయాలూ వాడేశాడు--జనం గొల్లుమంటూ వుండగా!  


ఇంకో విషయం యేమిటంటే, ఆయనకి ఆవేశం వస్తే, మాటలు ముందువి వెనక్కీ, వెనకవి ముందుకీ మారి పోయేవి!  


మావూళ్ళో మొదటిసారి ప్రత్యేకాంధ్ర వుద్యమం సందర్భంగా అనుకుంటా పోలీసుకాల్పులలో ఒకరు చనిపోయినప్పుడు, 'ఇలా తుపాకీ వారి సీ ఆర్ పీ గుళ్ళకి నా పౌరులు మరణిస్తూ వుంటే నేను చూస్తూ వూరుకోలేను--నా రాజీనామాకి పదవిని ప్రకటిస్తున్నాను' అన్నారు--బహిరంగ సభలో! (జనం చాలా బాధపడ్డారు!)  


పాపం అయన ఆత్మ శాంతిగానే వుండి వుంటుంది!

Saturday, December 5, 2009

కామెడీ అనే....


నిజమైన హాస్యం
తెలుగు సినిమాల్లో ‘కామెడీ’ విషయానికొస్తే, విజయా వాహినీలే మొదట చెప్పుకోవాలి. శ్రీ హెచ్ ఎం రెడ్డిగారు, కే వీ రెడ్డిగారు మంచి హాస్య ప్రియులు!

చక్రపాణి సినిమాలో ‘డాక్టరు గారింట్లో నెయ్యికేమి కొదువ! అందులోనూ పశువుల డాక్టరు గారింట్లో!’ లాంటి సంభాషణలు మచ్చు తునకలు.

ఇక మిస్సమ్మ విషయానికొస్తే, స్వయంగా ఏ ఎన్ ఆర్ తనకి ఆ (డిటెక్టివ్) పాత్ర ఇమ్మని అడిగానని ప్రకటించారు—అది ఆ సినిమాకి ఆయువుపట్టులాంటి పాత్ర!

నటుల్లో అంజిగాడి దగ్గర్నుంచి, రేలంగి, రమణా రెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య—ఇంకా రాజ బాబు, కేవీ చలం, చలం—తమదైన బాణీల్లో హాస్యం ఒలికించారు!

మన జంధ్యాల ప్రత్యేకం గా తెలుగు లో ‘హాస్య ప్రధానమైన’ సినిమాలకి ఒరవడి చుట్టారు.

‘గుడ్డు తండ్రి గాండ్రిస్తున్నాడు’; ‘తవికలు ‘; ‘నా ఆశ్వాన్ని తిసుకురండి’; ‘నా కొడుకూ కూతురూ రెండు పుర్రెలూ, యెముకలూ తీసుకెళ్ళి……………’ లాంటి సంభాషణలతో చెరగని తమ ముద్ర వేశారు కదా!

ఇలాంటి చమక్కుల వెనక ఓ రహస్యం వుందట!

అదేమిటో మరోసారి!

Saturday, November 14, 2009

హాస్యం



మహాహాస్యం


మొన్నోసారి టీవీలో ప్రమాదవశాత్తూ ఓ కార్యక్రమం చూశాను. అదే ఛానలో గుర్తులేదు గానీ, కార్యక్రమం మన అక్కినేని నాగేశ్వర రావు జన్మదినోత్సవం. ఈ మధ్యే జరిగిందో, పాతదై యేమైనా మళ్ళీ వేశారో కూడా తెలియదు.


ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వ్యాఖ్యాత అనుకుంటా! అక్కినేనిని స్టేజ్ మీదకి పిలిచినట్టున్నాడు--ఇద్దరూ చెరో స్టాండ్ మైక్ ముందూ నించున్నారు.  


ఇంతలో, రంగప్రవేశం చేశాడు 'వారి డొంకల వారు!' (ఆయన స్క్రిప్ట్ సిధ్ధం చేసుకోడం గానీ, అక్కడ అలా చేద్దామని గానీ ముందు అనుకోలేదనుకుంటా.)  


'యేమిటసలు? యేం జరుగుతోందిక్కడ?' లాంటి డైలాగ్ తో ఆయన మొదలు పెట్టారు.  


ఎస్పీ, 'అదిగో! ఆయనకి సన్మానం' అన్నట్టున్నాడు.  


రావి : 'ఆయనెవరు?' అని అక్కినేని వంకచూసి, 'ఈయనెవరో నాకు తెలీదు! అసలెవరీయన?'  


ఎస్పీ : 'ఆయన సినిమా యాక్టరు! చాలా సినిమాల్లో హీరోగా నటించారు.'  


రావి : 'ఆహా! కృష్ణుడు వేషాలూ, దుర్యోధనుడు వేషాలూ వేస్తూ, పాండవ వనవాసం లో భీముడు వేషం వేశారు, గంభీరం గా డైలాగులు చెపుతారూ--ఆయనా?'  


ఎస్పీ : 'హబ్బే! ఆయన అన్నగారు ఎన్ టీ ఆర్. ఈయన నాగేశ్వర రావు.'  


రావి : 'యేమోలే! హీరో అంటే ఆయననుకున్నా. ఇంతకీ మీరెవరు?'  


ఎస్పీ : "నన్ను 'భస్పీ మాల భభ్రమణ్యం' అంటార్లెండి'  


రావి : 'అలాగా! మీరూ యాక్టరేనా? భీముడి వేషం చేసింది మీరేనేమిటి--ఆయన కాదంటున్నారు?'  


ఎస్పీ : 'కాదు లెండి--పాటలూ అవీ పాడుతుంటాను.'  


రావి : 'యేమోలే. నీ పెర్సనాలిటీ చూసీ అలా అనుకున్నాను. ఇంతకీ ఆయనెవరు?'  


.............ఇలా సాగింది కొంతసేపు.  


కామెడీ కంటే, 'క్యామెడీ' యెక్కువైనట్టు అనిపించింది నాకు మాత్రం.  


'మహా హాస్య నటుడు' అంటూ తెలుగు లో చెప్పుకోవలసి వస్తే, కొంతవరకూ శ్రీ నాగభూషణం ని చెప్పుకోవాలి. 
తరవాత ఈ రోజుల్లో, శ్రీ బ్రహ్మానందం! (ఈయన కూడా కొన్నాళ్ళు 'స్టీరియో టైపు' నటన చేసి విసుగెత్తించినా, తరవాత కంట్రోలు అయ్యారు.)  


ఇక, 'వారి డొంకలవారు' ఇలాంటివి ప్రయత్నిస్తే, ఇలాగే వుంటుంది. అదే 'క్యామెడీ!'

Sunday, November 1, 2009

పెళ్ళిళ్ళలో సరదాలు

బెందాళం  


మా చదువులు పూర్తయ్యాక, వుద్యోగాలు రావడానికి ముందు దాదాపు ఓ యేడాది ఖాళీగా బలాదూరు తిరగవలసొచ్చింది. ఆ సమయం లో ఓ యేడేనిమిదిమంది చిన్నప్పటి స్నేహితులు--అందులో కొంతమందికి కొంతవరకూ చదువొచ్చింది, కొంతమందికి అదీ లేదు--ఓ గ్యాంగ్ గా కలుస్తూండేవాళ్ళం. మేం చెయ్యని అల్లరి లేదు (ఒక్క ఆడపిల్లల్ని యేడిపించడం తప్ప).  


తెలిసినవాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగితే, మేం హాజరు. అక్కడ మాత్రం, ఆడపిల్లల్ని ఆకర్షించడానికి మంచి డ్రెస్సులూ, బూట్లూ, మేకప్ తో హాజరు అయిపోయేవాళ్ళం. ఇంకా వాళ్ళని అల్లరల్లరిగా ఆటపట్టించి, వాళ్ళ దృష్టి ఆకర్షించడానికి పోటీ పడేవాళ్ళం.  


ఓసారి, మా గ్యాంగ్ లో భాస్కర రావు (నా కొండెగాడు కాదు) చెల్లెలి పెళ్ళి వచ్చించి. మా గ్యాంగ్ హాజరు--ఆడపెళ్ళివారి తరఫున!  


మధ్యాన్నం రెండింటికో యెప్పుడో ముహూర్తం. వేసవి కాలం. పొద్దున్న 8.00 కల్లా వచ్చేశారు మగపెళ్ళివారు. 


యెదురుకోళ్ళూ అవీ జరిగాయి--భాస్కర రావు మా సలహాపై 'గోల్డ్ స్పాట్' లు తెప్పించాడు వేసవికాలం కదా అని. యెందుకో మగపెళ్ళివారు కొంచెం యెక్కువగా 'డిమాండ్లు ' మొదలెట్టారు. వాళ్ళలో ఆడవాళ్ళు మరీ! స్నానాలదగ్గరనించీ యేవో కోపతాపాలు.  


కొంతసేపయ్యాక, మగపెళ్ళివారు 'కూలింగ్ వాటర్ ' అడుగుతున్నారని కబురు. మా భాస్కర్ అప్పటికీ ఓ డ్రమ్ము నీళ్ళలో ఐస్ వేసి పెట్టాడు. కొందరికి గోల్ద్ స్పాట్లు యెలాగూ ఇస్తున్నారు. అవి చాలేలా లేదు. మళ్ళీ తెమ్మని ఒకణ్ణి మార్కెట్ కి తోలాము.  


ఇంతలో మా భాస్కర్ విసుగ్గా--'కొంచెం బెందాళం పుచ్చుకొంటారేమో అడగండ్రా' అన్నాడు. మాకూ తెలీదు బెందాళం అంటే. వాణ్ణి అడిగితే మా చెవుల్లో చెప్పాడు.  


ఇక మేము విజృంభించాం--'యేమండీ--కూల్డ్ వాటరు తాగారా, గోల్డ్ స్పాట్ తాగుతారా? పోనీ ఓ గ్లాసు బెందాళం తెమ్మన్నారా?' అంటూ.


వాళ్ళు మొహమాటంగా 'వద్దండీ' అనేవారు!  


ఒకడు బెందాళం అనగానే, రెండోవాడు, 'మరే! బిందెడు బెందాళం రడీగా వుంది--వేడి వేడిగా! వేసంకాలం కాబట్టి, ఐస్ కూడావేసి చల్లటి బెందాళాన్ని కూడా సిధ్ధం చేశాం! ముగ్గురు నలుగురు పెద్దవాళ్ళు అడిగి మరీ తాగారు! మన వయసువాళ్ళకి ఇది తెలేదు లేరా!' అనేవాడు!  


భోజనాలు అయ్యి ముహూర్తం సమీపించే వేళకి, ఆడ పిల్లలూ, మగపిల్లలూ ఒకటే ముసిముసినవ్వులు బెందాళం పేరు చెప్పగానే! (మరి మావాడొకడు హీరోగా ఓ అమ్మాయిదగ్గర బెందాళం గురించి లీక్ చేశాడు!)  


అలా జాలీగా పెళ్ళి జరిపించేశాము.  


ఇంతకీ బెందాళం అంటే 'గంజి'  


అదండీ సంగతి!